దుర్వాస మహర్షి భార్యని భస్మం చేయుట | Telugu Stories

దుర్వాస మహర్షి Telugu Stories

శివుడు కోపంతో తాండవం చేస్తూ ఉంటె ఆ రూపాన్ని రౌద్రరూపం అంటాం,  రుద్రుడి క్రోధం నుండి పుట్టిన ఒక రుద్రంశకు ఎంతటి కోపం ఉంటుందో అది మనం ఊహించలేము, అలాంటిది రుద్రుడి కోపం నుండి పుట్టిన దుర్వాస మహర్షికి ఎంతటి కోపం ఉంటుందో మన అందరికి తెలిసిందే అయినప్పటికీ దుర్వాస మహర్షి తన భార్యను కూడా తన కోపం కారణంగా భస్మం చేశాడట. అసలు భార్యని భస్మం చేసే అంత కోపం ఆయనకు ఎందుకు వచ్చిందో…. ఆ కథ ఏంటో….ఇప్పుడు చూద్దాం.

ఒకరోజు దుర్వాస మహర్షి తపస్సులో ఉండగా బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడు, తిలోత్తమ అనే అప్సరసతో కలిసి, దుర్వాస మహర్షి ఉన్న ప్రదేశానికి వచ్చారు, వారు దుర్వాస మహర్షి ని గమనించకుండా నవ్వులు కేరింతలు పెడుతున్నారు, దానితో దుర్వాస మహర్షికి తపోభంగం జరిగింది. వెంటనే దుర్వాస మహర్షి కోపంతో  వారిద్దరిని రాక్షసులుగా పుట్టమని శపిస్తాడు.

దానికి వారిద్దరూ శాపవిమోచనం కోసం దుర్వాస మహర్షిని వేడుకుంటారు, దానికి దుర్వాస మహర్షి సాహసిక నువ్వు శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తావు అని, అలాగే తిలోత్తమ నీవు బాణాసురుని ఇంట ఉషగా జన్మిస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత తిలోత్తమ సాహసికులా  జంటను చూసి గృహస్థ ఆశ్రమం కోసం దుర్వాస మహర్షికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది.

భార్య కందళి

కానీ దుర్వాస మహర్షి  కోపానికి బయపడి ఎవ్వరు వివాహానికి ఒప్పుకోరు, అయితే ఔర్య మహర్షికి కందళి అనే కుమార్తె ఉంది. దానితో దుర్వాస మహర్షి ఔర్య మహర్షి దగ్గరికి వెళ్లి తన కుమార్తెను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు.

దానికి ఔర్య మహర్షి నా కూతురు అవివేకి అంత మంచి బుద్ది కలిగినది కాదు, చెప్పినా పని సరిగ్గా చేయదు, నీకేమో కోపం ఎక్కువ, కాబట్టి నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చెయ్యలేను అని ఔర్య మహర్షి అంటాడు. దానికి దుర్వాస మహర్షి నేను సర్దుకుంటాను మీరు మీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అంటాడు. సరే నేను ముందే చెప్పి కన్యాదానం చేస్తున్న అని కందళి దుర్వాస మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు.

Telugu Stories

వివాహం జరిగి కొన్ని రోజులు గడిచిపోతాయి, ఒకరోజు ఈ దుర్వాస మహర్షి గాఢ నిద్రలో ఉంటాడు, భార్య అయినా కందళి సాయంసంధ్య చేయవలిసిన సమయం దాటిపోతుందని గ్రహించి భర్త దగ్గరకు వెళ్లి గాడంగా నిద్ర పోతున్న దుర్వాస మహర్షిని నిద్ర నుంచి లేపుతుంది. దానికి నిద్ర భంగం కలిగిందని కోపంతో దుర్వాస మహర్షి కళ్ళు తెరిచి తన భార్య వైపు చూస్తాడు, అప్పుడు దుర్వాస మహర్షి కంటి నుండి అగ్ని రావడంతో ఆమె అక్కడికి అక్కడే భస్మం అయిపోతుంది.  ఆ తరువాత దుర్వాస మహర్షి తన తప్పు తెలుసుకొని చాలా బాధపడతాడు.

భార్య భస్మాన్ని చేతిలోకి తీస్కొని తన భార్య పేరు భూమి మీద శాశ్వతంగా ఉండాలని అలాగే సకల ప్రాణకోటికి ఆహారంగా, భగవంతుడికి ప్రసాదంగా ఉండాలని ఆ భస్మంతో ఒక చెట్టుని సృష్టించాడు. అదే కదళీ వృక్షం అంటే అరటిచెట్టు. ఈ విదంగా తన కోపం వల్ల భస్మమైన తన భార్య అరటిచెట్టు రూపంలో ఇప్పటికి కనిపిస్తుంది, అలాగే అరటిచెట్టు నుండి తన పంటను పూర్తిగా కోసి చెట్టుని సగం నరికాక మల్లి అరటిచెట్టు కొత్తగా చిగురిస్తుంది.

ఇక ఔర్య మహర్షి తన కూతురిని దుర్వాసుడు భస్మం చేశాడని తెలుసుకొని నేను నీకు ముందే చెప్పాను నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చెయ్యనని, నీవు అన్నిటికి సర్దుకుంటా అన్నావు,కానీ  ఇప్పుడు నా కూతురిని భస్మం చేసావు అని,  ఔర్యుడు కోపంతో దుర్వాస మహర్షిని, నీవు ఒక సామాన్య భక్తుని చేతిలో గోరమైన అవమానాన్ని పొందుతావు అని శపిస్తాడు.

పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందినా అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. ఈయన శ్రీరాముడికి పూర్వీకుడు, ఈ అంబరీషుడనే రాజు శ్రీమహా విష్ణుకి పరమ భక్తుడు, ఇతను బంగారాన్ని, మట్టిని సమానంగా చూసే ఒక గొప్ప వ్యక్తి. ఈయనాకు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుండే, సహజ గుణాలు అలవాటు ఐనాయి.

Telugu Stories

ఈ అంబరీషుడు శ్రీమహా విష్ణువుని భక్తితో కొలిచి ఒక గొప్ప యాగం చేశాడు, ఆ భక్తికి మెచ్చిన శ్రీ మహా విష్ణువు అంబరీషుడి రాజ్యం సుఖ సంతోషాలతో విల్లివిరిసేలాగా  సుదర్శన చక్రాన్నే వరంగా ఇస్తాడు.

ఆ తరువాత సుదర్శన చక్రం వల్ల అంబరీషుడి రాజ్యనికి ఏ కరువు లేకుండా సుఖ శాంతులతో ఉంటుంది. ఒకసారి ఈ అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, ఈ వ్రతంలో ఏకాదశి రోజు ఉపవాసం ప్రారంభించి ఒక సంవత్సర కలం పాటు దీక్షలో ఉంటూ మల్లి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ఆ తరువాత తన ప్రజలకి అన్నదానాలు చేయాలి.

అయితే అంబరీషుడి ఉపవాస దీక్ష కొద్దీ గడియాలలో ముగుస్తుందనే సమయానికి అక్కడికి దుర్వాసుడు వెళ్ళాడు, ఈ దుర్వాస మహర్షిని చూసి అంబరీషుడు అత్యంత భక్తి ప్రపత్తులతో దుర్వాస మహర్షిని ఆహ్వానించి ఆ రోజుకి తన గౌరవ అతిధిగా ఉండమని వేడుకుంటాడు. దానికి దుర్వాసుడు ఎంతో సంతోషించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపుకి వెళ్ళిపోయాడు.

ఇక దీక్ష విరమించడానికి పెట్టిన శుభముహుర్తం దాటిపోతుంది, నదిలో స్నానానికి వెళ్లిన దుర్వాస మహర్షి ఎంతసేపటికి తిరిగి రావడంలేదు, దానితో ద్వాదశ గడియలు దాటిపోతే వ్రతభంగం జరుగుతుందని, అలాగే అతిధిని కాదని భోజనం చేస్తే అతిధిని అవమానించినట్టు అవుతుందని ఈ అంబరీషుడు ఆలోచిస్తూ తన కులగురువు అయినా వశిష్ట మహర్షిని అడుగుతాడు,

ఇక వశిష్ఠ మహర్షి సలహా మేరకు అంబరీషుడు ద్వాదశ గడియలు దాటాక మునుపే శ్రీవారి పాదతీర్థం తాగి దీక్ష విరమించి దుర్వాసుడు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు, ఇది శాస్ర ప్రకారంగా చూస్తే తప్పు కాదు కానీ, స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాస మహర్షి తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయం తెలుసుకొని, అంబరీషుడు మాట తప్పినందుకు కోపంతో రగిలిపోయాడు.

ఈ దుర్వాస మహర్షి కోపంగా అప్పటికప్పుడే తన జడలలో నుండి ఒక వెంట్రుకని తీసి దానిలో నుండి రాక్షషుణ్ణి పుట్టించాడు, ఆ రాక్షషుడితో అంబరీషుడిని చంపేయమని చెప్తాడు, దానితో ఆ రాక్షషుడు అంబరీషుడి వైపుకి వెళుతుండగా సుదర్శన చక్రం వచ్చి ఒక్క వేటుతోనే రాక్షషుడిని సంహరించి,దుర్వాసుడిని కూడా చంపడానికి మీదికి వస్తుంది. దానితో దుర్వాసుడు ప్రాణభయంతో నాలుగు దిక్కులా పరిగెత్తుతూ చివరికి బ్రహ్మ, ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు.

వారిని రక్షించమని అడిగాడు దానికి వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వాళ్ళ కాదని నీవు విష్ణువు దగ్గరికే వెళ్ళమని చెప్పారు, దానితో దుర్వాసుడు విష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు, విష్ణువు కూడా నేను అంబరీషుడి భక్తికి బందీనాని, నీవు వెళ్లి అంబరీషుడినే శరణు వేసుకోమని చెప్తాడు. దానికి దుర్వాస మహర్షి చేసేదేమి లేక అంబరీషుడి దగ్గరికి వెళ్లి రక్షించమని అడుగుతాడు. దానితో ఈ అంబరీషుడు శ్రీవారి సుదర్శన చక్రాన్ని శాంతిపచేయమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. దానికి సురర్షణ చక్రం శాంతిస్తుంది.

ఇలా ఔర్య మహర్షి తన కూతురిని భస్మం చేసినందుకు దుర్వాస మహర్షికి ఇచ్చిన శాపం కారణంగానే అంబరీషుడి చేతిలో గోరమైన అవమానాన్ని దుర్వాసుడు పొందాడు, అలాగే ఈ దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం కూడా అంబరీషుడి ముందు పనిచేయకుండా దుర్వాసుడే ప్రాణభయంతో పరుగులు తీసాడు. ఈ విధంగా ఔర్య మహర్షి శాపం అంబరీషుడి కారణంగా శాపవిమోచనం జరిగింది. ఈ అంబరీషుడి కథ భాగవతంలో కూడా కనిపిస్తుంది.

Leave a Comment